2 తిమోతి 2 వ అధ్యాయము
2 తిమోతి 2:1 నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము.
మొదటి అధ్యాయములో ఇవ్వబడిన హెచ్చరికలకు కొనసాగింపుగా మరియు సువార్తకు, దేవునికి అలాగే పౌలు పట్ల ఎవరైతే నమ్మకముగా వున్నారో మరియు నమ్మకము లేకుండా వున్నారో వారిని జ్ఞాపకముచేసుకుంటూ, క్రీస్తుయేసునందున్న కృప చేత తిమోతి బలవంతుడుగా ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నాడు.
''నా కుమారుడా'' - గ్రీకు భాష నందు నా కుమారుడా అనే మాట నొక్కి వక్కాణించబడింది. 1:15 లో చెప్పబడిన వాక్యము ''ఆసియాలోని వారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు '' అని చెప్పిన దానికి ఇది వ్యత్యాసముతో కూడిన ప్రోత్సాహకరమైన మాటగ వున్నది.
ఆంగ్ల తర్జుమాలో నీవు అనే పదముతో ఈ వచనము ప్రారభించబడింది. వ్యక్తిగత సర్వనామాన్ని ముందుగా చెప్పడం ద్వారా, తాను చెప్పబోయే అంశం కంటే ముందుగా తిమోతిని బలముగా హెచ్చరిస్తున్నట్టుగా వుంది.
ఆంగ్ల తర్జుమాలో కావున అనే పదము కూడా వాడబడింది. ఇది తర్కముతో కూడిన ముగింపును ఇస్తుంది. BDAG ఇలా చెప్తుంది, ''కావున'' అనే పదము ఇంతకుముందు చెప్పిన వాటి యొక్క ఫలితాలను సూచిస్తుంది (BDAG, 736).
1:15 లో చెప్పబడిన దానితో పోల్చుకుంటే ఇక్కడ పౌలు ఇచ్చిన ప్రోత్సాహము ఏంటి? ''క్రీస్తుయేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము.''
''బలవంతుడవు కమ్ము'' ఇది వర్తమాన కాలములో రాయబడిన ఆజ్ఞగా వున్నది. అనగా అర్ధం అతడు ''నిరంతరము బలవంతుడుగా మారుతూనే ఉండాలి'' - ఇది ఒక్కసారి అయ్యి విడిచిపెట్టే కార్యము కాదు. (4 :17, 1 తిమోతి 1:12, రోమా 4: 20, ఎఫెసీ 6:10, ఫిలిప్పి 4:13). కాని స్వరము మాత్రం కర్మణి వాక్యంలో వుంది అనగా అర్ధం, అతడు కృపలో బలవంతుడవ్వాలి (కృప చేత) అది క్రీస్తుయేసు నందున్న కృప చేత. అనగా క్రీస్తులో ఉంచబడిన కృప చేత. మరొక మాటలో చెప్పాలంటే, కృప క్రీస్తులో వుంది. పౌలు యొక్క దృష్టిలో కృప = క్రీస్తు, క్రీస్తు = కృప. లేక మరొక విధానంలో చెప్పాలంటే - కృపకు ఆధారము క్రీస్తు, క్రీస్తులోనుండి లేక క్రీస్తు ద్వారా కృ ఉద్బవించబడుతుంది.
2 తిమోతి 2:2 నీవు అనేక సాక్షుల ఎదుట నావలన వినిన సంగతులను ఇతరులను బోధించుటకు సామర్ద్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.
ఈ వచనము తిమోతికి అప్పగింపడిన మొదటి లక్ష్యాన్ని సూచిస్తుంది- అదేమనగా అనేక సాక్షులయెదుట అతడు పౌలు నుండి విన్న సంగతులను, ఇతరులకు భోదించ సామర్ద్యముగల నమ్మకమైన ఇతర మనుష్యులకు అప్పగించాలి.
కావున, ఇక్కడ అభివృద్ధి చేసే క్రమము వుంది. తాను ఏమైతే నేర్చుకున్నాడో వాటిని అనగా బోధించడం మరియు ప్రోత్సహించడం వాటిని పౌలు తిమోతికి అప్పగించాడు. మరియు అతనికి ఒక ఉదాహరణగా వున్నాడు. అదే రీతిగా, తనకు ఏమైతే అప్పగింపబడిందో దానిని తిమోతి ఇతరులకు భోదించ సామర్ద్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగించాలి.
ఎందుకు పౌలు ఈ లక్ష్యాన్ని తిమోతికి ఇచ్చాడు ? ఎందుకంటే , తిమోతి ఎఫెసును విడిచిపెట్టి తన దగ్గరకు రావాలని పౌలు ఆశ పడుతున్నాడు కాబట్టి. (4:9 ''నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము మరియు 4:21 శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుబూలు, పుదే, లిను, క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచున్నారు). పౌలు తిమోతి ని చూడటానికి వేచి ఉండలేకపోయాడు.
2 తిమోతి 2:3 క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుని వలె నాతోకూడ శ్రమను అనుభవించుము.
ఈ వచనము తిమోతి చేయవలసిన రెండవ లక్ష్యాన్ని సూచిస్తుంది. అతడు ఖచ్చితంగా శ్రమను అనుభవించాలి.
శ్రమ అనుభవించుము అన్న పదమునకు వాడిన క్రియ 1:8 లో కూడా వాడబడింది. అందుచేత, తిమోతి శ్రమను అనుభవించాలి అని పౌలు కోరుతున్నాడు. కానీ ఎలా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునివలె అనుభవించాలి. పౌలు ఇక్కడ సైనిక పోలికను వాడుతున్నాడు.
Gordon Fee ఇలా చెప్తాడు:
ఇక్కడ వున్నా పోలిక ఆందోళనను ప్రతిబింబిస్తాయి (2:14-19), ఐతే సువార్త పరిచారకుడిగా అవి తిమోతికి సాధారణమైనవి ఎందుకంటే అతని పరిచర్య సైనికుని జీవితము యొక్క పోలికలను కలిగి వుంది. అతని యొక్క పని సహజముగానే, సైనికుని పోలి ఉంటుంది. ఎందుకంటే, ఒక సైనికుడు శ్రమను అనుభవించడానికి పిలువబడతాడు.
2 తిమోతి 2:4 సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు.
''సైనికుడెవడును ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు'' - 3 వ వచనంలో వాడిన పోలిక యొక్క ప్రతిబింబాన్ని పౌలు ఇక్కడ వాడుతున్నాడు (సైనికుడు). రోమా సైనికుల గురించి ఒకసారి ఆలోచించండి. (కనీసం) చాల మంది సైనికులు వారి యొక్క నాయకున్ని సంతోషపెట్టాలని ఎక్కువగా పని చేస్తుంటారు. కాబట్టి పౌలు చెప్తున్నాడు, ఏ సైనికుడు కూడా తన నాయకున్ని సంతోషపెట్టాలని చూస్తాడు కాని ఈ జీవనసంబంధమైన వ్యాపారములలో చిక్కుకొనడు.
ఐతే, తన యొక్క సైనిక నాయకున్ని సంతోషపెట్టాలంటే, ఒక వ్యక్తి తన పని పట్ల సమర్పణ కలిగి ఉండాలి లేక తన పిలుపుకు పూర్తి విధేయత చూపేవాడుగా ఉండాలి.ఇక్కడ పౌలు చెప్పే అంశం ఏంటంటే, దేవుని సేవకుడు తన పిలుపుకు విధేయత చూపేవాడుగా ఉండాలి లేక తనను నడిపించే నాయకునికి విధేయత చూపేవాడుగా ఉండాలి. తిమోతి యొక్క సమర్పణ మరియు విధేయతను గూర్చి పౌలు నొక్కి చెప్తున్నాడు.
2 తిమోతి 2:5 మరియు జెట్టిఅయినా వాడు పోరాడునప్పుడు నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.
ఈ వచనంలో పౌలు మరియొక పోలికను చెప్తున్నాడు.
మరియు - ఇంతకూ ముందు వచనము యొక్క పొడిగింపు ఇది.
జెట్టియైనా వాడు - లక్ష్యముతో కూడిన పోరాటంలో పాల్గొనే వాడు.
నియమ ప్రకారము పోరాడకుంటే అతనికి కిరీటము దొరకదు - జెట్టియైనా వాడు నియమాలను పాటించకపోతే అతడు కిరీటము పొందుకోలేదు లేక అతని బహుమతిని పొందుకోలేడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమనగా, నియమాలను పాటించటం. అదేమనగా, నియమాల ప్రకారం పోరాటంలో పాల్గొనే క్రీడాకారుడు లేక శ్రమలలో పాలిభాగస్తుడుగా ఉండేవాడు కిరీటాన్ని పొందుకుంటారు (చివరి సంఘటనలను గూర్చిన ఆలోచన)
NIGTC ఇలా చెప్తుంది: ఒక క్రైస్తవ పరిచారకునికి చెప్పే అంశం ఏమనగా శ్రమపడటానికి ఇష్టపడాలి అనేది దేవుడు కోరే క్రైస్తవ జీవన విధానంలో వున్నా ఒక నియమము (3; 1:8 ). పౌలు ఈ అంశాన్ని 3:12 లో స్పస్టముగా చెప్పాడు (మత్తయి 5:10-12, లూకా 6:22-23).
2 తిమోతి 2:6 పాటు పడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసినవాడు.
పౌలు మరొక పోలికను ఉపయోగిస్తున్నాడు అది - వ్యవసాయకుడు. ఇక్కడ అంశం ఏంటి అనగా కష్టపడినా వ్యవసాయకుడే ఫలమును లేక భాగమును పొందుకుంటాడు. ఇక్కడ పౌలు శ్రమపడుట అనే అంశమును నొక్కి చెప్తున్నాడు. ఒక వ్యవసాయకుడు కష్టపడకుండా ఏమి పొందుకుంటాడు లేక సంపాదించుకుంటాడు? ఏమి సంపాదించుకోలేడు. ఒకవేళ వ్యవసాయకుడు తక్కువ కష్టపడిఎక్కువ ఫలితాన్ని ఆశించినట్లైతే, అతడు ఎటువంటి ఫలితాన్ని చూడలేడు. అయితే అతడు ఒకవేళ ఎక్కువ కష్టపడినట్లైతే, అప్పుడు ఎక్కువ ఫలితాలను చూడగలడు.
కష్టపడుట అనగా అర్ధం, కష్టించి పని చేయటంలో నిమగ్నమై యుండుట, సమస్యలను సూచిస్తుంది. - కష్టపడుట, శ్రమ పడుట, పని చేయుట.
పౌలు ఉపయోగించిన పోలిక (వ్యవసాయకుడు) క్రైస్తవ జీవితములో మెళుకువను సూచిస్తుంది. సైనికుని వలె మరియు క్రీడాకారుని వలె వ్యవసాయకుడు కూడా మెలుకువ కలిగి ఉండాలి. అప్పుడే అతడు ఫలితాలను చూడగలడు.
2 తిమోతి 2:7 నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును.
ఈ వచనము తిమోతి శ్రమలలో పాలుపంచుకోవాలని సూచిస్తుంది. ప్రాధమికంగా, పౌలు చెప్పిన దానిని తిమోతి ప్రతిబింబించాలి.
''అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును.'' - ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఒకవేళ దేవుడు నీకు వివేకం ఇవ్వొచ్చు అని పౌలు చెప్పలేదు. అన్ని విషయములలో ప్రభువు నీకు వివేకమనుగ్రహించును అని ఖచ్చితముగా చెప్తున్నాడు.
తిమోతి యొక్క శ్రమ వృధాగా పోదు. ఆ శ్రమలను అర్ధం చేసుకునే శక్తిని మరియు కృపను దేవుడు తిమోతికి ఇస్తాడు.
2 తిమోతి 2:8-9 నా సువార్త ప్రకారము, దావీదు సంతానంలో పుట్టి మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. నేను నేరస్తుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడియుండలేదు.
''యేసుక్రీస్తును జ్ఞాపకము చేసికొనుము'' - తిమోతి యేసుక్రీస్తును మర్చిపోయాడని కాదు, కాని వాస్తవికంగా వున్నా సంఘటనలను పౌలు గుర్తుచేసుకుంటున్నాడు అవి - యేసుక్రీస్తు దావీదు సంతానంలో పుట్టియున్నాడు. మరియు ఆయన మృతులలో నుండి లేచియున్నాడు.
ఇంతకు ముందు వచనాలలో తన యొక్క మాదిరికరమైన జీవితం మీద ద్రుష్టి పెట్టి తన వలె తిమోతిని కూడా శ్రమలను అనుభవించమని కోరియున్నాడు. ఎందుకంటే, తాను మార్పు చెందిన తరువాత నిజమైన క్రైస్తవ జీవితాన్ని పౌలు జీవించాడు. తనకు అప్పగింపబడినది అని చెప్పుకున్న సువార్త ప్రకటనను అన్యులకు ప్రకటించడంలో నమ్మకమైన జీవితాన్ని జీవించాడు.
దేవునికి, సువార్తను ప్రకటించుటలో మరియు పౌలు పట్ల కొంతమంది వ్యక్తులు నమ్మకముగా వున్నారని అతడు రుజువు పరిచాడు. (ఇది పౌలు పవిత్రుడు, నిందా రహితుడు అని చెప్పటం లేదు లేక తాను ఒక నియమావళిని రూపొందించాను దాని ప్రకారము పౌలును ముందుగా వెంబడించాలి, తరావుత దేవుణ్ణి వెంబడించాలి అని చెప్పటం లేదు కాని తన జీవితాన్ని సువార్త ప్రకటనకు ధారపోసాడు మరియు క్రీస్తు నిమిత్తం అన్ని త్యాగం చేసిన వాడుగా తనను తాను మాదిరిగా ఉంచుకున్నాడు - ఇది ఒక వ్యక్తి దేవునికి ఇవ్వగలిగిన పూర్తి సమర్పణ.
ఇంతకుముందు వచనాలలో తనను తాను ఒక మాదిరిగా చూపించాడు కాబట్టి, క్రీస్తు యొక్క మాదిరిని కూడా తిమోతి తెలుసుకోవాలని పౌలు ఆశపడుతున్నాడు. కాబట్టి అతడు అలా చెప్పాడు, జరిగిన సంగతులు జ్ఞాపకము చేసుకో, ప్రత్యేకించి కేరెస్టుకు ఏమి జరిగిందో జ్ఞాపకము చేసుకో అని కోరుతున్నాడు.
''నా సువార్త ప్రకారము'' - ఈ వాక్యము గూర్చి అనేకమైన అపార్థములు వున్నాయి. అవి ఏమనగా, పౌలు ఒక కొత్త సువార్తను ప్రకటిస్తున్నాడు అని లేక క్రీస్తు బోధించిన బోధలతో పోల్చుకుంటే పౌలు యొక్క బోధలు భిన్నముగా వున్నవి అని. ఇటువంటి ఆలోచనలు లేక ప్రశ్నలు మొదటిలోనే మనం విడిచిపెట్టాలి అని మనం గమనించాలి ఎందుకంటే అవన్నీ అసందర్భ వాదనలు.
తన కన్నులతో చూసిన వాటిని పౌలు ప్రకటించాడు. అతడు క్రీస్తును తన కన్నులతో చూసాడు. అతడు సత్య సువార్తను అనగా యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాడు.
నా సువార్త ప్రకారము అని చెప్పుట ద్వారా తనకు అప్పగింపబడిన సువార్త అని పౌలు బలముగా చెప్తున్నాడు.
రెండు విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. (1) మృతులలోనుండి తిరిగి లేచుట (2) దావీదు సంతానంలో పుట్టడం. ఈ రెండు మాటలు పౌలు ఎందుకు ప్రస్తావించాడు? ఇవి రెండు వాస్తవాలు కాబట్టి, కానీ ఈ రెండు విషయాలు ప్రస్తావించుటకు ప్రాథమిక కారణం తిమోతిని బలపరచడం కోసం - క్రీస్తు మరణమును ఓడించాడు, కాబట్టి ఇది ఒక విజయము. ఈ మాట ద్వారా చెప్పదలచుకున్నది ఏంటి అంటే మరణమును ఓడించిన క్రీస్తు నీ యొక్క లక్ష్యాలలో నిన్ను బలపరుస్తాడు అని. ''దావీదు సంతానంలో పుట్టిన వాడు'' అన్ని మాట దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడింది అని సూచిస్తుంది.
''నేను నేరస్తుడనై యున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడియుండలేదు.'' పౌలు శ్రమ పొందుటకు కారణము సువార్తను ప్రకటించుట. కానీ నేరస్తుడివలె శ్రమపడ్డాడు. నేరస్తుడు అని ఇక్కడ వాడబడిన పదము యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన దొంగలకు కూడా వాడబడింది (లూకా 23 : 32 - 39). దాని అర్ధం చెడు పనులు చేసిన వారు లేక చెడు పనులు చేయటంలో నిమగ్నమైన వారు. అంటే పౌలు దుర్మార్గపు పని చేసాడని అర్థమా? కానే కాదు, కాని పౌలు చేసిన పని దుర్మార్గపు పనిగా అన్యజనుల చేత చిత్రీకరించబడింది.
''అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు'' - తాను వున్న పరిస్థితికి వ్యత్యాసమును పౌలు తెలియచేస్తున్నాడు. అది చెప్పాలంటే, నేను సంకెళ్ళతో బంధింపబడి ఉండవచ్చు, కానీ దేవుని వాక్యము బంధింబడియుండలేదు. ప్రకటించువాడు సంకెళ్లతో ఉండవచ్చు కాని వాక్యము బంధింపబడి యుండదు.
2 తిమోతి 2:10 అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తుయేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను.
''అందుచేత ఏర్పరచబడిన వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను'' ఇది దేనిని సూచిస్తుంది? ఏర్పరచబడిన వారి కొరకు సమస్తమును పౌలు ఓర్చుకొనుటకు కారణము సువార్త వాక్యము.
అతడు శ్రమలన్నిటిని ఓర్చుకొనుటకు కారణము ఏర్పరచబడిన వారందరు రక్షణ పొందాలని. ఈ వచనంలో రక్షణ యొక్క ఆవశ్యకత తెలియచేయబడుతుంది. అదేమనగా, రక్షణ ''ఇప్పుడు'' అందుబాటులో వుంది - ఇప్పుడే వర్తమానకాలములోనే.
ఎవరు ఏర్పరచబడిన వారు? ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసముంచుతారో వారు.
''నిత్యమైన మహిమతో కూడా , క్రీస్తుయేసునందలి.'' రక్షణ దేవుని దగ్గర నుండి వస్తుంది. అది క్రీస్తులో నిక్షిప్తమై యున్నది.
''నిత్యమైన మహిమతో కూడా'' పౌలు చివరి సంఘటనలను గూర్చిన దృష్టిని కలిగి వున్నాడు. ఇది జీవితం యొక్క మరొక దశ గూర్చి మాట్లాడుతుంది.
2 తిమోతి 2:11-13 ఈ మాట నమ్మదగినది ఏదనగా - మనమాయణతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రదుకుదుము. సహించిన వారమైతే, ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే , మనలను ఆయన ఎరుగననును. మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.
''ఈ మాట నమ్మదగినది'' - ఏ మాటను గూర్చి ఇక్కడ చెప్తున్నాడు? ఇది 1-10 వచనాలకు అనుసంధానమై వుంది. మరొక మాటలో చెప్పాలంటే, ''నాటో కూడా శ్రమను ఆనుభవించుము'' అని చెప్పిన మాటను మనసులో ఉంచుకొని చెప్తున్న మాట ఇది. (క్రీస్తును మరియు తాను ఏమి చేసాడో జ్ఞాపకం చేసుకుంటూ).
మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే
ఆయనతో కూడా బ్రదుకుదుము.
మనము సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము.
ఆయనను ఎరుగమంటే, మనలను అయన ఎరుగననును.
మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా
ఉండును.
ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.
11-13 ఒక క్రమములో చెప్పుట ద్వారా ఒక వాదనను తిమోతికి పౌలు చెప్తున్నాడు.
''ఒకవేళ, అయితే'' అనే పదములు విశ్వాసులకు తగినవి. ఇవి విశ్వాసుల యొక్క క్రియలను సూచిస్తున్నాయి. వాటి వెను వెంటనే వచ్చే ఫలితాలు కూడా రాయబడ్డాయి.
ఈ భాగము ఒక పద్యముల వ్రాయబడింది అని గమనించండి. కాబట్టి వాటిని ఒకదాని తరువాత ఒకటి ధ్యానిస్తేనే సరిగా అర్ధమవుతుంది.
మొదటి లైన్: ''మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే, ఆయనతో కూడా బ్రదుకుదుము'' - ఇది విశ్వాసి యొక్క మార్పును సూచిస్తుంది, క్రీస్తుతో పాటు మరణించి తిరిగి లేవడం. ఇక్కడ ఒక నిశ్చయత కూడా ఇస్తుంది. అది మనం ఆయనతో కూడా జీవిస్తాము. అయితే ఇది ఆయనతో చనిపోయిన వారుగా ఉంటే అనే పునాది మీద ఆధారపడి వుంది. ఒకవేళ ఆయనతో మనం చనిపోకపోతే, ఆయనతో జీవించే అవకాశం ఉండదు.
రెండవ లైన్: ''సహించిన వారమైతే, ఆయనతో కూడా ఏలుదుము'' - ఇది భద్రతను సూచిస్తున్నది. అదనంగా, శ్రమను అనుభవించమని తిమోతిని కోరిన భాగములో ఇది ఒకటి. (రోమా 12:12; మార్కు 13:13 ). సహించుట అనే పదమునకు అర్ధము, నమ్మకాన్ని కొనసాగించుట లేక వ్యతిరేకతను ఎదుర్కొనే క్రియ (BDAG, 1039). ''ఏలుదుము'' అనగా అర్ధం, ''చివరి సంఘటనలలో క్రైస్తవులు వారి యొక్క ప్రభువుతో కలిసి రాజ్యాధికారాన్ని పంచుకొనుట'' (BDAG, 956). కాబట్టి, వ్యతిరేకతలలో కూడా ప్రభువు మీద మనకున్న నమ్మకంతో సహించి చివరి వరకు ఆయనను సేవించినట్లైతే, అప్పుడు మనము ఆయనతో కూడా ఏలుదుము.
మూడవ లైన్: ''ఆయనను ఎరుగమంటే, మనలను ఆయన ఎరుగననును.'' ఒకవేళ ఆయనను మనం కాదు అంటే, ఆయన మనలను కూడా కాదనును. ఈ వాక్యంలో విశ్వాసులకు వుండే వ్యతిరేక స్థితిని గమనించాలి, రెండవ లైన్ లో వున్నా దానికి ఇది వ్యతిరేకముగా వుంది. కాబట్టి, చివరి వరకు మనము సహించినట్లైతే, మనము ఆయనతో కూడా పరిపాలిస్తాము. ఒకవేళ ఆయనను మనం తృణీకరించినట్లైతే, ఆయన కూడా మనలను తృణీకరించును. క్రీస్తును గూర్చి విశ్వాసులు సిగ్గుపడే అంశం కూడా ఇందులో ఇమిడి వుంది.
గమనిక: సువార్తను ప్రకటించడానికి, వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించడానికి చాల మంది సిగ్గు పడుతుంటారు. వారి క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతుంటారు. అటువంటి వారు క్రీస్తును తృణీకరిస్తున్నారా? మత్తయి 10:33 లో క్రీస్తు ఏమి చెప్పాడో చూడండి. ''మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును.''
ఆసియాలో తనను ఎవరైతే విడిచిపెట్టి వెళ్లారో వారందరి గూర్చి పౌలు ఈ వాదనలు తెలియచేస్తున్నాడు. మరియు ఏర్పరచబడిన వారికి అలాగే తిమోతికి కూడా ఈ సూచనలు ఇస్తున్నాడు.
నాలుగవ లైన్: ''మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును.'' మనము నమ్మదగని వారము కాము అని చెప్పడం లో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? విశ్వాసులు నమ్మదగని వారుగా ఉండటం సాధ్యమా? అవును. కానీ ఇది తన ప్రజల పట్ల దేవునికి వున్ననమ్మకత్వాన్ని ప్రభావితము చేయదు. దేవుడు ఎల్లపుడు నమ్మదగినవాడుగా ఉంటాడు. ఎందుకంటే తనను తాను తృణీకరించుకోలేడు కాబట్టి ఆయన ఎల్లపుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు.
దేవుడు తనకున్న నమ్మకత్వాన్ని బట్టి ఎవరైతే నమ్మదగిన వారుగా లేరో వారిని క్షమిస్తాడు అని అర్థమా? క్షమించవచ్చు. ఇక్కడున్న సందర్భం ఇలా చెప్తుంది. Gordon ఈ విధముగా చెప్తాడు.
దేవుడు తన యొక్క కృపతో మన యొక్క మోసమును అధిగమిస్తాడు (కొంతమంది వ్యాఖ్యానించినట్టుగా) లేదా తన ప్రజల కోసం, తనయొక్క నమ్మకత్వముతో ఇచ్చిన నిత్య రక్షణ అనే బహుమతి కొంతమంది నమ్మకత్వము లేకపోయినంత మాత్రాన రద్దు చేయబడదు. ఇది ఇక్కడ చెప్పిన సందర్భములోను మరియు పౌలు చెప్పిన తరువాత సందర్భాలలోనూ కనపడుతుంది. కొంతమంది నమ్మకము లేని వారుగా రుజువు చేయబడ్డారు. కానీ రక్షించే దేవుని యొక్క నమ్మకత్వము మాత్రం రద్దు చేయబడలేదు.
''ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయనేరడు'' - దేవుడు తనను తానూ తృణీకరించుకోడు, ఒకవేళ ఆయన ఆలాగున చేస్తే, ఆయన దేవుడే కాదు.
2 తిమోతి 2:14 వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు అని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.
సిద్ధాంతపరమైన అంశాలను చెప్పిన తిమోతికి చెప్పిన తరువాత, ఎఫెసులో తిమోతి యొక్క బాధ్యతలను పౌలు జ్ఞాపకము చేస్తున్నాడు.
''ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము'' - జ్ఞాపకము చేయుము అనేది వర్తమాన కాలములో వున్న ఆజ్ఞగ వున్నది. అంటే ఈ సంగతులను గూర్చి అనగా 11-13 వచనాలలో వున్న సంగతులను నిరంతరమూ జ్ఞాపకము చేయుము అని అర్ధం.
''పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు అని, ప్రభువు ఎదుట వారికి సాక్షమివ్వు'' - ఈ జ్ఞాపకము చేయుట అనేది దేవుని ఎదుట జరగాలి. అదేమనగా, వారిని భాద్యులుగా చేయుట, మరియు పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు అని తిమోతి ఖచ్చితముగా వారికి చెప్పాలి. మాటలను గూర్చి ఎవరు వాదము పెట్టుకుంటారు? సంఘము పెట్టుకుంటారు ఎందుకంటే అబద్ద బోధకుల ప్రభావము వుంది కాబట్టి.
''వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలు'' - మాటల యుద్దాన్ని ''పనికిరానివి మరియు వినువారిని చెరుపుతాయి'' అని పేర్కొన్నాడు. అనగా, ఎవరైతే వాటిని వింటారో వారిని దారి తప్పించేవిగా ఉంటాయి లేక హాని కలిగిస్తాయి.
2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్త పడుము.
''దేవుని ఎదుట యోగ్యునిగా కనపరుచుకో.'' తిమోతి ఏమి చేసిన అది దేవుని చేత ద్రువీకరించబడాలి (1 తిమోతి 1:18-19, 4:6-8, 13-15, 6:11-14).
ఇక్కడ పౌలు చెప్పే విషయం ఏమనగా, అబద్ద బోధకులు చేసే దానికి వ్యత్యాసాన్ని తెలియచేస్తున్నాడు. వారు మనుష్యుల అంగీకారాన్ని కోరతారు. కాబట్టి, దేవుని అంగీకారాన్ని కోరమని తిమోతికి పౌలు హెచ్చరిస్తున్నాడు.
''జాగ్రత పడుము'' అనే పదమునకు అర్ధం, ఆసక్తి కూడిన పనితో లేక ప్రేరణతో ఏదైనా పని చేయటం." - కష్టించి పని చేయటం, శాయశక్తులా ప్రయాసపడటం. లేక ఆశక్తి కలిగి ఉండటం, చేయదగిన ప్రతి ప్రయత్నము చేయుట. KJV తర్జుమాలో చెప్పినట్లుగా చదువుట అని అర్ధం కాదు.
కాబట్టి, తిమోతి దేవుని చేత అంగీకరించబడుటకు అతడు ఆశక్తి కలిగి ఉండాలి. మరియు అతడు చేయదగిన ప్రతి ప్రయత్నము చేయాలి. ఎందుకు పౌలు దీనిని చెప్పాడు?
ఎందుకంటే, ఒక వ్యక్తి పూర్తి నమ్మకంతో దేవుని వాక్యం బోధించడానికి తనను తాను పూర్తిగా సమర్పించుకోవాలి. వేరే ఏ మాటలు కాదు కాని, సత్యమును గూర్చిన వాక్యము (సువార్త) ను మాత్రమే ప్రకటించాలి. మరియు దేవుడు ఒకరి యొక్క ప్రవర్తనను, మరియు జీవితాన్ని పరిశీలన చేస్తున్నాడని అనే విషయాన్నీ ఈ మాట ద్వారా తెలియచేస్తున్నాడు.
''సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండుము'' - ఒక వ్యక్తి తన పనిలో యోగ్యుడిగా ఉంటే, అతడు సిగ్గు పడనవసరం లేదు.
''సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను ఉండుము'' - ఎవరైతే కష్టించి పని చేయడానికి వారి జీవితాలను సమర్పించుకుంటారో, వారు సత్య వాక్యాన్ని సరిగా ఉపదేశించటానికి నమ్మకత్వముతో, ఎప్పటికప్పుడు సిద్దపడుతూ వుంటారు.
ఇవన్నీ కేవలం తిమోతికి ఇచ్చిన సూచనలు మాత్రమే కాదు, కాని ప్రజలనుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ వారి ముందు తమ్మును తాము కనుపరచుకొనే అబద్ద బోధకుల యొక్క వ్యత్యాసాన్ని కూడా తెలియచేస్తున్నాడు.
అయితే, ఈ వాక్యంలో పౌలు మానవ కార్యములను తెలియచేస్తూ, చివరికి తన పట్ల వుండే సమర్పణను గూర్చి దేవుడు పరిశీలన చేస్తుంటాడని తెలియచేస్తున్నాడు. దేవుని చేత అంగీకరించబడటం అనేది సులభమైన విషయం కాదు. కష్టముతో కూడిన పనిని , మరియు జీవితాంతము శ్రమ పడే పనిని కలిగి యుండాలి.
2 తిమోతి 2:16-17 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనైయును, ఫిలేతును వున్నారు.
ఈ వచనాలలో ఎవరైతే అబద్ద బోధకులుగా వున్నారో వారిని గూర్చి పౌలు తెలియచేస్తున్నాడు. వారు దేవుని చేత అంగీకరించబడలేదు.
''అపవిత్రమైన వట్టి మాటలు'' - పనికి మాలిన మాటలు: ఒక ఉద్దేశము అంటూ లేని మాటలు.
''అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు'' - వారిలో భక్తి లేకపోవుట అనేది కాదు కాని, ఇటువంటి అపవిత్రమైన వట్టి మాటలు మాటలాడుట ద్వారా వారి జీవితాలు అర్ధం లేనివిగా మరియు భక్తిహీనమైన జీవితాలుగా మారిపోతాయి.
''కొరుకుపుండు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకును'' - వారి యొక్క అపవిత్రమైన మాటలు భక్తిహీనతను లేక భక్తిహీనత కలిగిన ప్రజలను తయారు చేయటం మాత్రమే కాదు కాని, అవి కొరుకుపుండు వలె ప్రాకుతాయి.'' కొరుకుపుండు అనే వ్యాధి తీవ్రమైన మంటతో కూడుకున్న వ్యాధి. సరైన సమయములో దానిని పరిశీలించకపోతే అది భయంకరమైన అల్సర్ వ్యాధిగా మారుతుంది.''
వారిలో హుమెనైను, ఫిలేతును వున్నారు.
2 తిమోతి 2:18 వారు - పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
హుమెనైను, ఫిలేతు సత్యమునుండి తప్పిపోయినవారుగా వున్నారు. విశ్వాస విషయములో వారు గురి తప్పి యున్నారు (BDAG, 146).
వారు కేవలం విశ్వాసమునుండి తప్పిపోవడం మాత్రమే కాక, పునరుత్థానము గతించిపోయింది అని చెప్తున్నారు. (2 థెస్స 2:2). వారి యొక్క బోధతో, కొందరి యొక్క విశ్వాసమును వారు నాశనము చేస్తున్నారు.
2 తిమోతి 2:19 అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలకడగా వున్నది. ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా వున్నది.
అయినను - అబద్ద బోధకులు మరియు అబద్ద బోధలు వుండినప్పటికి, తన వారు ఎవరో దేవునికి తెలుసు. ( సంఖ్యా 16:5). అయన యొక్క పునాది నిలకడగా వున్నది. క్రెస్తవుని యొక్క స్థిరత్వాన్ని పౌలు సూచిస్తున్నాడు- ఒక క్రైస్తవుని స్థిరత్వము దేవునిలో ఉంటుంది. ఎందుకంటే అయన పునాది కదలకుండా నిచ్చలముగా ఉంటుంది. అవి బలమైనవి.
పౌలు మరొక నిశ్చయతను ఇస్తున్నాడు, ఆ నిశ్చయత యొక్క అర్హత ఏమనగా, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు, దుర్నీతినుండి తొలగిపోవాలి.
2 తిమోతి 2:20-21 గొప్ప ఇంటిలో వెండి పాత్రలును, బంగారు పాత్రలును, మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకూ అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును.
20 వచనంలో పౌలు మరల, ఇల్లు మరియు పాత్రలు అనే పోలికను ఉపయోగిస్తున్నాడు. 19 వచనంలో తానూ చెప్పినదానికి వివరముగా ఈ మాటలు చెప్పడం జరిగింది.'' ప్రభువు నామమును ఒప్పుకోను ప్రతివాడు దుర్నీతినుండి తొలగిపోవలెను.''
''గొప్ప ఇంటిలో వెండి పాత్రలును, బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును.'' ఈ పోలిక పౌలు కాలం నాటికి వున్న ఇల్లులను సూచిస్తుంది. ఇల్లు గొప్పగా ఉండటం మాత్రమే గాక ఆ ఇంటిలో వెండి పాత్రలు వున్నాయి అలాగే బంగారు పాత్రలు వున్నాయి. అంటే ఇది ధనికుల ఇల్లును సూచిస్తుంది. అక్కడ కొన్ని విలువ లేనివి కూడా వున్నాయి (కఱ్ఱవియు మరియు మంటివియు). వెండి మరియు బంగారు పాత్రలు ఘనతకు ఉపయోగించబడతాయి. కఱ్ఱవియు మంటివియు ఘనహీనతకు ఉపయోగించబడతాయి. ఈ పోలిక బాషా యొక్క అంశం ఏంటి? గృహ నిర్వాహక అంశాలను సూచిస్తుంది.
ఈ విషయములో NAC ఇలా చెప్తుంది:
పౌలు చెప్పిన గొప్ప ఇల్లు సంఘాన్ని సూచిస్తుంది. కొన్ని పాత్రలు విలువైనవి. (బంగారము మరియు వెండి) మరియు కొన్ని విలువ లేనివి (కఱ్ఱవి, మరియు మంటివి). వీటిలో కొన్ని పాత్రలు కొన్ని ప్రాముఖ్యమైన (ఘనమైన) సందర్భాలలో ఉపయోగిస్తారు. మరికొన్ని సాధారణ ఉద్దేశాలకు ఉపయోగిస్తారు. బంగారము మరియు వెండి అనే పాత్రలు అనే పోలికను అర్హులైన క్రైస్తవులకు పాల్ ఉపయోగించాడు. కఱ్ఱవి, మరియు మంటి పాత్రలు అనే పోలికను అర్హత లేని క్రైస్తవులకొరకు పౌలు ఉపయోగించాడు. ఇక్కడ పౌలు చెప్పే అంశం ఏంటి అంటే సంఘము అనేది నమ్మకతము కలిగిన మరియు నమ్మకత్వము లేని క్రైస్తవులతో నింపబడి ఉంటుంది. కొంతమంది అర్హత కలిగిన ముగింపు కలిగి ఉంటే మరి కొంతమంది సిగ్గు పడే ముగింపును కలిగి వున్నారు. 21 వ వచనంలో పౌలు తన యొక్క పాఠకులను వారి మంచి పనికి అడ్డు తగిలే వారిని ఇంకా చెప్పాలంటే అబద్ద బోధకులను విసర్జించామని కోరుతున్నాడు.
''ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. ఈ వచనము 20 వ వచనంతో అనుసంధానము చేయబడి వుంది.
మరల పౌలు షరతుతో కూడిన పదజాలమును ఉపయోగించాడు. ఎవడైనను .....
ఎవడైనను అంటే ఎవరు? దీనిలో తిమోతి చేర్చబడతాడా? Gordon Fee ఎవడైనను అనే పదములో తిమోతి కూడా చేర్చబడతాడని చెప్పాడు. ఏ ఉద్దేశములో అంటే అతడు కూడా తనను పరిశుద్ధపరచుకొనే కోణములో. ఒకవేళ పౌలు సాధారణ కోణములో అయినా తిమోతిని చేర్చిన కూడా Gordon ఈ కోణములో చదివి ఉండవచ్చు.
నా ఆలోచనలలో: తిమోతి అర్హతలేని భాగానికి చెందిన వ్యక్తి కాదు. అర్హత లేని ప్రజల యొక్క క్రియలలో అతడు ఖచ్చితముగా పాల్గొనకపోవచ్చు. కాబట్టి ఎవడైనను అనే పదము తిమోతిని సూచించవచ్చు కానీ ఎవరైతే ఇంటికి సంబంధించిన వారుగా వున్నారో వారికొరకు ప్రత్యేకించి చెప్పబడింది.
కాబట్టి, ఎవడైనను పవిత్రపరచుకుంటే, తన్ను తాను పవిత్రపరచుకుంటాడు. ఆ తరువాత అతడు ప్రత్యేకింపబడిన పాత్రగా, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, యజమానుడు వాడుకునే పాత్రగా ఉంటాడు. ఈ వచనంలో వున్న తరువాత భాగము తన్ను తాను పవిత్రపరచుకొనుట ద్వారా లేక పరిశుద్ధపరచుకొనుట ద్వారా కలిగే ఫలితాన్ని సూచిస్తుంది. అతడు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు వాడే పాత్రగా, పరిశుద్ధమైన పాత్రగా, యజమానుడు వాడుకొనే పాత్రగా ఉంటాడు (2 :4) ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడుట అనేది ప్రవర్తనను సూచిస్తుంది.
2 తిమోతి 2:22 నీవు యవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
''యవనేచ్ఛలనుండి పారిపొమ్ము, మరియు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పౌలు ఇప్పుడు తిమోతికి కావలసిన వ్యక్తిగతమైన సూచనలు ఇస్తున్నాడు. యవనేచ్ఛలనుండి పారిపొమ్ము, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని పౌలు చెప్పటం ద్వారా తిమోతి వ్యక్తిగతమైన సమస్యలు కలిగి వున్నాడు అని అర్ధం కాదు. కాని యవ్వన కాలపు కోరికలు అనే మాట అపవిత్రమైన మాటలు, మూఢుల వితర్కములును దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది (23).
మరియు, అబద్ద బోధకు సంబంధించి, తిమోతి యవ్వనస్తుడు కాబట్టి పౌలు ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. యవనేచ్ఛల మీద మనస్సు ఉంచుటకు బదులుగా, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని పౌలు చెప్తున్నాడు (1 తిమోతి 6:11, గలతి 5:22-23).
నీతి- న్యాయబద్ధముగా ఉండటం.
విశ్వాసము- దేవుని పట్ల నిరంతరము నమ్మకము కలిగి ఉండటం.
ప్రేమ - దేవునిని మరియు పొరుగువారిని ప్రేమించుట. ఇక్కడ సూచించబడిన విషయము ఏమి లేదు- ప్రేమకొరకైనా విషయము కాబట్టి తిమోతి దేవుని మరియు పొరుగువారికి ప్రేమించేవాడుగా ఉండాలని చెప్పబడింది అని మాత్రమే అంచనా వేయగలము.
సమాధానము: చక్కని స్థితి, మరియు స్థిరత్వము.
2 తిమోతి 2:23 నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము.
22 వ వచనంలో చెప్ప్పబడిన దానికి భిన్నముగా నేర్పులేని మూఢుల వితర్కములను విసర్జించుము అని పౌలు చెప్తున్నాడు. కారణం ఏమనగా అవి జగడములను లేక మాటల యుద్దాన్ని పుట్టిస్తాయి.
2 తిమోతి 2:24-26 సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని, ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వీకముతో శిక్షించుచు, జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను.
తిమోతి యజమానికి ఉపయోగపడేలా ఉండాలి. కాబట్టి, అబద్ద బోధకులు మరియు వారి యొక్క పనులకు అనగా నేర్పులేని మూఢుల వితర్కములు, అపవిత్రమైన వట్టి మాటలకు భిన్నముగా, తిమోతి దేవుని యొక్క సేవకునిగా జగడమాడని వాడుగా ఉండాలని తెలియచేయబడుతుంది. దీని అర్ధం అతడు లోపమును ఎదుర్కోవద్దు అని కాదు కాని అందరి యెడల సాత్వీకుడుగా ఉండాలని అర్ధం (ఎఫెసీ 4:15). అతడు బోధింప సమర్థుడుగావుండాలి (1 తిమోతి 3:2); అతడు సహనము కలిగినవాడుగా లేక సహించేవాడుగా ఉండాలి.
తిమోతి తన యొక్క వ్యతిరేకులకు సాత్వీకముతో సూచనలు ఇవ్వాలి. ఈ సూచనలు కొంత కష్టముగా ఉండవచ్చు ప్రత్యేకించి ఎఫెసు సంఘములాంటి పరిస్థితులలో కష్టముగానే వుంటాది, కాని తిమోతి దేవుని ఎదుట యోగ్యునిగా కనుపరచుకోవాలి.
''సత్య విషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును.'' - పైన చెప్పినవన్నీ తిమోతి పాటించుట ద్వారా, ఎదురాడు వారికి సత్యవిషయమైన అనుభవజ్ఞానము కలుగునట్లుగా దేవుడొకవేళ మారు మనస్సు దయచేస్తాడు అనే నిరీక్షణ పౌలు కలిగి వున్నాడు.
''అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో'' - ఈ వచనంలో వున్న ఈ భాగము పౌలు నిరీక్షించిన దానికి నిర్దారణను తెలియచేస్తుంది. అది, ఎప్పుడైతే తిమోతి తనను తాను దేవుని సేవకునిగా కనుపరచుకుంటాడో (పైన పేర్కొనబడిన లక్షణాలతో), అప్పుడు వారు జ్ఞానము తెచ్చుకుంటారు. వారు ఆలోచించడం మొదలుపెడతారు మరియు సాతాను యురిలోనుండి తప్పించుకుంటారు. అనగా అర్ధం, సాతాను చేత కొంతమంది పట్టబడినప్పటికి, ఆ స్థితి నుండి వారు బయటికి వస్తారు, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి వస్తారు అనే నిరీక్షణ ఇంకా వుంది.
తిమోతి ఇతరులకు మాదిరిగా ఉండాలి అని పౌలు ఆశపడుతున్నాడు అనేది ఈ అధ్యాయము యొక్క సారంశాము. కేవలం తప్పును వ్యతిరేకించుట ద్వారా మాత్రమే కాదు కాని సాత్వీకముగా ఉండుట ద్వారా మరియు ఇతరులను ప్రేమించుట ద్వారా దేవుడు అతనిని తన విమోచన కార్యము కొరకు ఉపయోగించుకొనును.
Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.