March 25

0 comments

Titus Chapter 1

By Dr. Joel Madasu

March 25, 2020

#bsn.bibleprabodhalu, New Testament, Titus

తీతుకు వ్రాసిన పత్రిక 

మొదటి అధ్యాయము 

ఉపోద్గాతము/ శుభములు

 

తీతు 1:1 -2, “దేవుడు ఏర్పర్చుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను.”

Checkout the BibleArc at biblearc.com. It is free (mostly) and very interesting program! The above illustration is called ARC design.

తీతు 1 : 1 -2

1 ఏ. పౌలు 

1 బి . దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడు

1 సి . దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును 

1 డి. భక్తికి ఆధారం 

2 ఏ . నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ 

2 బి - 2 సి . అబద్ధమాడనేరని దేవుడు 

2 డి - 2 ఈ . అనాదికాలమందే వాగ్దానము చేసెను.

దీని యొక్క అర్ధం ఏంటి?

''దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడునైన పౌలు” - ''దేవుని యొక్క బానిస'' గా మరియు ''యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడు'' గా  ఇది పౌలు యొక్క గుర్తింపు. అదేమనగా, పౌలు కేవలం దేవుని యొక్క దాసుడుగా లేక బానిసగా మాత్రమే కాకుండా అపోస్తులుడుగా కుడా వున్నాడు. పైన చిత్రం లో చూపినట్లుగా పౌలు తానూ ఎవరు అనే వివరణ ఇస్తున్నాడు. పేరుకు అతడు, దేవుని యొక్క దాసుడు మరియు యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడు. ఇలా చెప్పటం ద్వారా పౌలు క్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలియచేస్తున్నాడు.

''నిమిత్తము'' - అనే పదము ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. పౌలు దేవుని యొక్క దాసుడు మరియు యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా వున్నది ''ప్రోత్సహించుట కొరకు'' - ''దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తము, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును .... ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను.''  ''దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తము'' - అనే పదము పౌలు యొక్క ఉద్దేశంగా వున్నది. దీని యొక్క అర్ధం ఒక వ్యక్తి యొక్క విశ్వాసమును అర్ధం చేసుకొనుటకు అతడు అపోస్తులుడుగా నియమించబడ్డాడు అని కాదు కానీ విశ్వాసములోనికి వచ్చే వారిని గూర్చి నియమించబడ్డాడు అని అర్ధం .

''దేవుడు ఏర్పరచుకొనినవారు'' - పాత నిబంధనలో దేవునియందు విశ్వాసముంచిన వారిని ఉదహరించే భాషను వాడుతున్నాడు. ఈ పదాన్ని నూతన నిబంధనలోను మరియు దేవునియందు విశ్వాసముంచి వారందరికీ విస్తరింపచేస్తూ ఉపయోగించాడు (కీర్తన 105:43; రోమా 8:౩౩; కోలస్సి 3:12; 2వ తిమోతి 2:10). ఏర్పరచబడిన వారు అనగా దేవునియందు నమ్మకముంచిన వారందరు. 

ఏర్పరచబడినవారిని గూర్చి NAC అనే వ్యాఖ్యానము లో ఇలా చెప్పబడింది: 

క్రైస్తవ విశ్వాసులందరిని దేవుని చేత ఏర్పరచబడినవారు అని చెప్పుట ద్వారా (రోమా 8:33; కోలస్సి 3:12), మానవ రక్షణ ప్రణాళికలో దేవుని కార్యాన్ని, వేదాంతపరంగా  ''ఎన్నుకొనుట'' అని చెప్పబడిన ఆలోచన వైపు దృష్టిని మరల్చే పదాన్ని ఉపయోగించాడు. ఈ సిద్ధాంతము పౌలు బోధించింది కాదు. ఇది యేసుక్రీస్తు స్వయంగా బోధించిన మాటలను ప్రతిబింబిస్తున్నాయి (ఉదా: మత్తయి 22:14; 24:22, 24, 31, మరియు దానికి సమాంతర భాగాలు; లూకా 18; యోహాను 6:37 - 44; 10:27-29). మరియు ఇతర నూతన నిబంధన రచయితలు యొక్క మాటలను చూపిస్తున్నాయి (ఉదా: ఆ.కా 13:48 ; 1వ పేతురు 1:1 - 5; 2:9;  వ పేతురు 1:3, 10 -11; ప్రకటన 17:14). దేవుని ఎన్నిక అనేది రక్షణ సిద్ధాంతములో ఒక మూల అంశంగా వున్నది (సోటిరియాలజీ అని పిలుస్తారు ఈ సిద్ధాంతాన్ని). మానవ ఆలోచనలకు ఈ అంశాలు మర్మములుగా వుండినప్పటికీ, ఎన్నిక అనేది దేవుడు తన ప్రజలతో చేసిన కార్యములలో ప్రాముఖ్యమైన భాగముగా బైబిల్ అంతటిలో నొక్కి వక్కాణించబడింది. ఇశ్రాయేలును ఎన్నుకొనుటలో ఈ విషయం స్పష్టంగా కనపడుతుంది. (ద్వితీ 7:6 -9; 14:2; కీర్తన 33:12; యెషయా 41: 8 - 10; యెహెఙ్కేలు 20:5 ఆ.కా 13:16 - 17). మరియు సంఘమును ఎన్నుకునే విషయములో కూడా ఇది స్పష్టమవుతుంది (కోలస్సి 3:11 - 12; 2వ థెస్స  2:13 -14; 1వ పేతురు 1:1; 2 : 9 - 10; ప్రకటన 17:14). రక్షణ యొక్క మూలము, కర్త, కొనసాగించువాడు మరియు నిశ్చయాత ఇచ్చువాడు దేవుడే అని పౌలు ప్రత్యేకముగా తన పత్రికలన్నిటిలో బోధిస్తూ వచ్చాడు (రోమా 8 : 28 -39; 9: 10-16; ఎఫెసీ 1 :4-14 ; 2: 4-10, 1వ థెస్స 1:4-5).

''భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము'' - ''ఇక్కడ సత్యము'' అనే పదము సహజముగా సువార్తను సూచిస్తుంది (1వ తిమోతి 2: 4). ఐతే, ఇక్కడ ఆ పదము విశ్వాసము యొక్క తలంపును సూచిస్తుంది (Gordon ,168). ఇది విశ్వాసము యొక్క తలంపు అని అర్ధం చేసుకోబడుతుంది ఎందుకంటే ''జ్ఞానము” లేక ''గుర్తింపు'' అనే పదము సత్యవిషయమైన అనుభవజ్ఞానము అనే పదములోఇమిడి వుంది ఈ జ్ఞానము తరువాత దేవుని యెడల భక్తి అని నిర్వచించబడింది. అది భక్తికి ఆధారమగు సత్యజ్ఞానము.

''నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ'' - ఆధారము అనే పదముతో దీనిని నిర్వచించవచ్చు - ఎందుకంటే, దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తము మరియు భక్తి లోనికి నడిపించే వారి యొక్క విశ్వాస జ్ఞానము నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ మీద ఆధారపడి వుంది - అదేమనగా, నిత్యజీవము యొక్క నిరీక్షణ యందు ''విశ్రాంతి'' కలిగియుండుట.

''అబద్ధమాడనేరని దేవుడు, అనాదికాలమందే వాగ్దానము చేసెను.'' - నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ అనాదికాలమందే దేవుడు చేసిన వాగ్దానము మీద ఆధారపడివుంది. 

''అబద్ధమాడనేరని దేవుడు'' - (సంఖ్యా 23:19). ఈ వచనంలో పౌలు రెండు వాస్తవాలు బహిర్గతము చేస్తున్నాడు. 1) దేవుడు అబద్దమాడనేరడు, మరియు 2) నిత్యజీవాన్ని గూర్చి ఆయన వాగ్దానము చేసాడు. మరియు దేవుడు వాగ్దానము చేసిన సమయము ''అనాదికాలమందు.'' 

గోర్డాన్ ఈ విధముగా చెప్తాడు: 

పౌలు చెప్పే అంశం ఏమనగా, ఇప్పుడు విశ్వాసులు కలిగినా నిత్యజీవాన్ని గూర్చిన ఆలోచనలు క్రీస్తు యొక్క త్యాగం ద్వారా, ఆత్మ వలన ప్రత్యక్షపరచబడేంత వరకు దేవునిలో దాగి వున్నాయి అనునది. (రోమా 16:25 -26; కోలస్సి 1:25 -26; 39; 9:10 -16; ఎఫెసీ 1:4-14; 2:4 -10; 1 థెస్స 1:4 -5).


తీతు 1:3 - "మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటనవలన తన వాక్యమును యుక్తకాలములయందు బయలుపరచెను."

''తన వాక్యమును తన సొంత కాలములో బయలుపరిచాడు'' - ఎవరి సొంత కాలము? దేవుని యొక్క సొంత సమయములో, ఆయన బయలుపరిచాడు (తెలుసుకునేలా చేయుట, దగ్గరయ్యేలా చేయుట, లేక చూపించుట, BDAG , 1048 - 49), ప్రకటన వలన (ప్రకటించబడిన అంశము, లేక ప్రకటించబడుతున్నది) అదే, సువార్త (వాక్యము) (2వ తిమోతి 2:9; 1:15; 4:2; తీతు 1:9; 2:5).

''నాకు అప్పగింపబడినది'' - దేవుడు ఇచ్చిన వర్తమానము తీసుకుని వెళ్లే బాధ్యత పౌలుకు ఇవ్వబడింది. అప్పగించబడుట అనే మాటకు అర్ధం, ''ఒక వ్యక్తిని గూర్చి పట్టించుకునే బాధ్యత అప్పగించడం --- అప్పగించుట, ఒక వ్యక్తి యొక్క జాగర్త లోనికి పంపుట.'' BDAG చెప్పేది ఏమనగా, "ఒకరి యొక్క నమ్మకంలోనికి లేక పరిపూర్ణమైన నిశ్చయత లోనికి అప్పగించుట, ఎవరినైతే పూర్తిగా నమ్మామో వారికి పూర్తి బాధ్యతలను అప్పగించుట.''

''మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము'' - దేవుని ఆజ్ఞ ద్వారా దేవుని యొక్క వాక్యము పౌలుకు అప్పగించబడింది అని అర్ధం (Gordon Fee, 169).

ఈ భాగము యొక్క అంశము ఏంటి? తనకు ఎవరైతే వాక్యమును అప్పగించారో ఆ దేవుని యొక్క దాసుడుగా, మరియు యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా పౌలు తన యొక్క గుర్తింపును, అధికారాన్ని ప్రకటించుకొనుట.

తీతు 1:4 - "మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రిఐన దేవుని నుండియు, మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు, సమాధానమును కలుగును గాక."

''తీతుకు'' - యితడు పత్రికను స్వీకరించినవాడు. పౌలు వ్యక్తిగతముగా సంభోదించాడు కాబట్టి వెంటనే అందుకున్న వ్యక్తి గాఅర్ధం చేసుకోవచ్చు.

''మన అందరి విశ్వాసవిషయములో నా నిజమైన కుమారుడు'' - ఆధ్యాత్మిక కోణంలో తీతు పౌలు యొక్క కుమారుడు - లేక పౌలు యొక్క వర్తమానమును తీసుకెళ్లే కోణములో తీతు పౌలు యొక్క కుమారుడు.

''ఒకే విశ్వాసము'' - విశ్వాసవిషయములో తీతు పౌలు యొక్క నిజమైన కుమారుడు.

క్రింద వున్నా చిత్రాన్ని గమనించండి. ఆంగ్లములో తర్జుమా చేయబడిన “in” అనే పదము అనేక తర్జుమాలలో పొరపాటు గా వుంది. అయినప్పటికీ, ఒకే అంశానికి సంబందించినవారు అనే ఆలోచనను ఈ తర్జుమాలు ఇస్తున్నాయి. అదేమనగా, పౌలు మరియు తీతు ఒకే విశ్వాసమును కలిగి వున్నారు. వారిద్దరూ ఒకే విశ్వాసమునకు చెందినవారు.

''తండ్రిఐన దేవుని నుండియు, మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు సమాధానమును కలుగును గాక.'' - తండ్రిఐన దేవుని మరియు కుమారుని మధ్య వ్యత్యాసాన్ని తెలిపే విధముగా పౌలు సహజమైన శుభవచనములు తెలియచేసాడు.

(గమనించండి, 1వ తిమోతి లో వాడబడిన శుభవచనములోని సమాధానము అనే పదము ఆంగ్ల తర్జుమా లో లేదు) 

తీతు 1:5  - "నేను నీ కాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా వున్నవాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని."

5వ వచనములో, తీతును పౌలు క్రేతులో విడిచిపెట్టుటకు గల ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు. 

''నేను విడిచిపెట్టాను'' - అనగా అర్ధం, తీతుతో పాటు పౌలు క్రేతులో వున్నాడు.

''దిద్ది'' అనగా అర్ధం సరిచేయుట. 

ఈ వచనంలో రెండు ఉద్దేశాలు ఇవ్వబడ్డాయి.

  1. సరిచేయబడకుండా వున్నవి సరిచేయటం - అనగా అర్ధం కొన్ని విషయాలు ప్రారంభించబడ్డాయి, కానీ పూర్తి కాలేదు.
  2. ప్రతి పట్టణములో పెద్దలను నియమించుటకు - అనగా అర్ధం, అక్కడ పెద్దలు ఎవరు లేరు, కావున తీతు యొక్క బాధ్యత లేక అతని యొక్క పరిచర్య ఏమనగా పెద్దలను నియమించుట.

పెద్దలకు సూచనలు: 

తీతు 1:6-9 “ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీపురుషుడును, దుర్వ్యాపారవిషయము నేరము మోపబడనివారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలుగలవాడునై యున్న యెడల అట్టివానిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథిప్రియుడును, సజ్జనప్రియుడును, స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశనిగ్రహముగలవాడునై యుండి తానూ హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాటను ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగ చేపట్టుకొనువాడునై యుండవలెను.”

460 వ మూలప్రతిలో ఈ భాగానికి మరికొంత జోడించబడి వుంది. 

''రెండుసార్లు వివాహము చేసుకున్నవారికి పెద్దలుగా నియమించవద్దు. పరిచారకులుగా కూడా చేయవద్దు. రెండవ వివాహము ద్వారా భార్యను పొందిన వారిని దేవుని పరిచర్య చేయుటకు వేదిక దగ్గరకు కూడా రానివ్వకుము. దేవునియొక్క దాసుడుగా, అన్యాయముగా వున్నవారిని, అబద్ధికులను, దయలేనివారిని, మోసగాండ్ర గా వున్నా పెద్దలను గద్దించుము.”

6 - 9  వచనాలలో, పెద్దలను నియమించుటకు తీతుకుకొన్ని మార్గదర్శకాలను పౌలు ఇచ్చాడు. 

నిర్దేశించబడిన సూత్రాల పట్టిక: 

మొదటి జాబితా:

  1. నిందారహితుడై ఉండాలి. (7వ వచనము) 
  2. అతిథిప్రియుడై యుండాలి. (8వ వచనము) 
  3. సజ్జనప్రియుడై ఉండాలి. (8వ వచనము) 
  4. స్వస్థబుద్ధిగలవాడునై యుండాలి. (8వ వచనము) 
  5. నీతిమంతుడై యుండాలి. (8వ వచనము) 
  6. పవిత్రుడై యుండాలి. (8వ వచనము) 
  7. ఆశానిగ్రహము గలవాడై యుండాలి. (8వ వచనము) 
  8. నమ్మదగిన బోధను గట్టిగ చేపట్టువాడై యుండాలి. (9వ వచనము)
    రెండవ జాబితా: 
  9. స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. (7వ వచనము)
  10. ముక్కోపిగా ఉండకూడదు. (7వ వచనము)
  11. మద్యపానిగా ఉండకూడదు. (7వ వచనము)
  12. కొట్టువాడుగా ఉండకూడదు. (7వ వచనము)
  13. దుర్లాభమును అపేక్షించువాడుగా ఉండకూడదు. (7వ వచనము)

జాబితాల యొక్క పూర్తి వివరణ:

మొదటి జాబితా:

అధ్యక్షులు నిందారహితులుగా ఉండాలి అంటే అర్ధం ఏంటి?

దీని అర్ధం ఏమనగా అధ్యక్షుడు ఎటువంటి నేరారోపణలు లేనివాడై యుండాలి. ఎవరు కూడా అతనిని తప్పు పట్టే విధముగా జీవించకూడదు. ఇది ''కుటుంబానికి'' సంబందించిన అంశం, ప్రత్యేకించి దేవుని కుటుంబానికి  సంబందించినది. 1వ తిమోతి 3:5 లో ఒక ప్రశ్న ఇలా వుంది: ''ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినా యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును?”  

అధ్యక్షుడు అతిథిప్రియుడుగా ఉండాలి అంటే అర్ధం ఏంటి?

సణుగుకొనకుండ పరదేశులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చే స్వభావము.

అధ్యక్షుడు సజ్జనప్రియుడై యుండాలి అనగా అర్ధం ఏంటి?

మంచి విషయాలను ప్రేమిచి, మంచి వ్యక్తులకు వాటిని బోధించే వాడై ఉండాలి అని అర్ధం. 

అధ్యక్షుడు స్వస్థబుద్ధిగలవాడై యుండాలి అనగా అర్ధం ఏంటి?

తనను తానూ నియంత్రించుకునే స్వభావము మరియు మంచి ఆలోచనలు కలిగే వుండే బుద్ది అని అర్ధం. 

అధ్యక్షుడు పవిత్రుడై యుండాలి అనగా  అర్ధం ఏంటి?

దేవుడు ఏమైతే కోరుతున్నాడో ఆ విధముగా నీతిమంతుడై ఉండాలి అని అర్ధం.

అధ్యక్షుడు పవిత్రుడై యుండాలి అంటే అర్ధం ఏంటి?

పొరపాట్లు లేకుండా దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలి అని అర్ధం.

అధ్యక్షుడు ఆశనిగ్రహముగలవాడై ఉండాలి అంటే అర్ధం ఏంటి?

భావోద్వేగాలు, శరీర కోరికలు నియంత్రిచుకొన్నవాడై ఉండాలి అని అర్ధం.

అధ్యక్షుడు నమ్మదగిన బోధను చేపట్టాలి అంటే అర్ధం ఏంటి?

ఇక్కడ రచయిత నొక్కి వక్కాణించేది ఏంటి? నమ్మదగిన బోధను చేపట్టాలి అంటే అర్ధం అధ్యక్షుడు తనకు అప్పగింపబడిన బోధ విషయములో నమ్మకత్వముగా ఉండాలి అని అర్ధం. ఈ సమయములో, ఒక క్రైస్తవుని యొక్క బోధ గుర్తించబడుతుంది. సహజముగా, పౌలు బోధించిన వాక్యము సువార్త, మరియు క్రీస్తు యొక్క బోధలు మరియు ఆయన చేసిన కార్యములు. కావున పౌలు ఖచ్చితముగా చెప్పేదేమంటే అధ్యక్షుడు తాను బోధింపబడిన యందు నమ్మకముగా ఉండాలి అని అర్ధం. 

ఎందుకు దీనిని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు? పౌలు తరువాత మాటలలో ఇంతకుముందు చెప్పిన మాటల యొక్క ఉద్దేశాన్ని తెలియచేసాడు - ''తానూ హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు'' బోధించే విషయములో నమ్మకముగా ఉండాలి.” 

రెండవ జాబితా:

మొదటి జాబితాలోని అంశాలు అధ్యక్షుడు ఎలా ఉండాలో చెప్తే రెండవ జాబితాలోని అంశాలు అధ్యక్షుడు  ఎలా వుండకూడదో తెలియచేస్తున్నాయి. 

అధ్యక్షుడు స్వేచ్ఛాపరుడై ఉండకూడదు అనగా అర్ధం ఏంటి?  

అధ్యక్షుడు సొంత తలంపులతో కానీ, కఠినుడు గా గాని ఉండకూడదు అని అర్ధం (2వ పేతురు 2:10). 

అధ్యక్షుడు ముక్కోపియై ఉండకూడదు అంగ అర్ధం ఏంటి?

అధ్యక్షుడు దీర్ఘశాంతుడుగా, సమాధానముగా ఉండాలి అని అర్ధం (1వ తిమోతి 3:3).  

ఇక్కడ అంశం ఏమనగా, దేవుని కుటుంబాన్ని నిర్వహించే వ్యక్తి సాత్వికుడు  అయి ఉండాలి మరియు సొంత ఆలోచనలు లేకుండా, కఠినుడు కానివాడై ఉండాలి. ఎందుకంటే అతడు పరిపాలించేది తన ఇల్లు కాదు కానీ దేవుని ఇంటిని పరిపాలిస్తున్నాడు (మార్కు 10:41 -45; 1వ కొరింథీ 3:5 - 9; 4:1 -2).

మరొక మాటలో చెప్పాలంటే, అధ్యక్షుడు తనను తాను నియత్రించుకోవాలి.

అధ్యక్షుడు మద్యపానియై ఉండకూడదు అంటే అర్ధం ఏంటి?

త్రాగుబోతు అయి ఉండకూడదు అని అర్ధం. ఎందుకంటే ఇది: 

  1. దేవుని ఆజ్ఞ గా వుంది. 
  2. హింసకు  దారితీయవచ్చు.

అధ్యక్షుడు కొట్టువాడై ఉండకూడదు అంటే అర్ధం ఏంటి?

అధ్యక్షుడు హింసను ప్రోత్సహించేవాడుగా ఉండకూడదు అని అర్ధం, లేక పోట్లాడేవాడుగా, బలవంతం చేసేవాడుగా ఉండకూడదు అని అర్ధం. పోట్లాడే వ్యక్తిత్వముతో దేవుని ఇంటిని ఒక వ్యక్తి ఎలాగూ నడిపించగలడు? 

అధ్యక్షుడు దుర్లాభమును అపేక్షించకూడదు అంటే అర్ధం ఏంటి?

ధనమును ఆశించడం పొరపాటు కాదు. మిషనరీలు, పౌలు లాంటి వాళ్ళు తమ పరిచర్యలో వాళ్ళు కస్టపడి పని చేసారు, మరియు వారి యొక్క ప్రతినిధుల ద్వారా దేవుని పనికి సహాయం చేయమని సంఘాలను ప్రోత్సహించారు. ఐతే ఇక్కడ అధ్యక్షుడు ధనాన్ని ఆశించకూడదు అని వుంది. దీని అర్ధం ఏమనగా ధనాన్ని సంపాదించుటకు అతడు తన నిజాయితీని కోల్పోకూడదు అని అర్ధం. అనగా క్రైస్తవ పరిచర్య నుండి లాభమును సంపాదించుకోకూడదు.

తీతు 1:10  - “అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును, వదరబోతులును, మోసపుచ్చువారునై యున్నారు.”

"విశేషముగా" - అనే పదము పౌలు ఇచ్చిన మార్గదర్శకాలకు కారణాన్ని వివరించే పదముగా వున్నది. ఆ కారణం ఏమనగా, అక్కడ ఎక్కువ మంది అవిధేయులు వున్నారు, వదరుబోతులు, మోసపుచ్చువారు వున్నారు. వీరందరూ కూడా యుధులై యున్నారు. 

కాబట్టి, ఈ సంఘానికి సున్నతి సంబంధులనుండి అనగా యూదుల నుండి ప్రమాదం పొంచి వున్నది. 1వ తిమోతి పత్రికలో చెప్పబడిన అబద్ద బోధకుల వలెనె. 

తీతు 1:11 - “వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.”

ఈ వచనము 10వ వచనమునకు అనుసంధానముగా వున్న వచనము.

విశేషముగా అక్కడ అనేకులైన అవిధేయులు వున్నారు … (ఇది మూల వచనము)

కావున ...

ఇది తప్పనిసరిగా చేయవలసిన పని - నోళ్లు మూయించడం (ఇది అనుసంధాన వచనము) 

నోళ్లు ముయింపవలెను - ఒకరిని మాట్లాడనివ్వకుండా చేయటం (L-N 33:124).

తీతు ఎందుకు వారి నోళ్లు మూయించాలి? ఎందుకంటే వారు కుటుంబాలనే పాడుచేస్తున్నారు. ఒకరి యొక్క ఆంతరంగిక జీవితాలకు హాని కలుగచేస్తున్నారు లేక నాశనం, మరియు వారి జీవితాలను తలక్రిందులు చేస్తున్నారు.

వారు కుటుంబాలను ఎలా పాడు చేస్తున్నారు? ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుట ద్వారా. (1వ తిమోతి 5:12 లో చెప్పినదానికి ఇది పోలికగా వున్నది). వారు దుర్లాభము కొరకు కుటుంబాలను పాడు చేస్తున్నారు.

తీతు 1:12 - “వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను - 'క్రేతీయులు ఎల్లపుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండిపోతులునై యున్నారు.'”

''వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇలా చెప్పాడు'' - వారి సొంత ప్రవక్తలలో వున్న ఆ వ్యక్తి ఎవరు? 

Epimenides, 16వ శతాబ్దములో పేరెన్నికగన్న క్రేతీయుల తత్వవేత్త.

ఈ వచనము Hesiod అనే తత్వవేత్త చెప్పినదానిని పోలి వుంది, Theog 26: ''పొలములలో నివసించే గొర్రెల కాపరులు మీపై నిందలు ఏమి లేవు, తిండిపోతులు అనే నిండా తప్ప'' (గ్రీకు అక్షరాలు) (ఎడిటర్ చేత అనువాదము) అంతేకాకుండా, ఈ వచనము Callimachus అనే కవి వ్రాసిన దానిని పోలి వుంది, Hymnus in love 8f (cited in athenagoras, suppl 30): ''క్రేతీయులు ఎల్లపుడు అబద్ధికులు, ఓ ప్రభువా క్రేతీయులు నీ కొరకు నిర్మించారు; ఐతే నీవు మరణించలేదు, నీవు ఎప్పటికి వున్నవాడవు'' (Κρῆτες  εὶ ψεῦσται. καὶ γὰρ τάφον, ὦ ἄνα, σεῖο | Κρῆτες ἐτεκτήναντο. σὺ δʼ οὐ θάνες. ἐσσὶ γὰρ αἰεί) (ఎడిటర్ చేత అనువాదం). Theodore of Mopsuestia అనే వ్యక్తి రాసినప్పుడు Callimachus అనే కవి రాసిన వచనమును నుండి కొన్ని ఉదాహరించాడు.'' క్రైస్తవ బోధలను వ్యతిరేకిస్తూ పుస్తకాలను రాసినవారు వారి పుస్తకాలలో ఇలా చెప్పారు ... క్రేతీయుల గురించి ఆ కవి చెప్పిన దానితో పౌలు ఏకీభవించాడు అని. కానీ వాస్తవానికి ఆ కవిత్వంతో కాని ఆ కవితో కాని ఏకీభవించలేదు ఆ రోజుల్లో, ఆ కాలములో ప్రజలు ఉపయోగించిన రీతిగానే  అతడు కేవలం ఆ కవి యొక్క కవిత్వాన్ని ఒక సామెతగా ఉపయోగించాడు. (Martin Dibelius and Hans Conzelmann, The Pastoral Epistles: A Commentary on the Pastoral Epistles, Hermeneia, 136).

పౌలు దీనిని ఒక సామెతగా ఉపయోగించాడు.

11వ వచనంలో, పౌలు చెప్తాడు, ''వారి నోళ్లు మూయింపవలెను'' ఎందుకంటే వారు సత్యము చెప్పటం లేదు కాబట్టి .

కావున, క్రేతీయులు అబద్ధికులు అని పౌలు చెప్పాడు. వారు కేవలం అబద్ధికులు మాత్రమే కాదు కాని వారు దుష్టమృగములు (హానికరమైన, దుర్మార్గమైన ప్రజలు) మరియు సోమరులగు తిండిపోతులు. సోమరులు అనగా, ఏ పని చేయడానికి ఇష్టపడనివారు మరియు తిండిపోతులు అనగా ఎక్కువగా తినుటకు ఇష్టపడేవారు.

ఈ మాటలను క్రేతీయులందరికి ఆపాదించకూడదు. క్రేతీయులందరిని అబద్ధికులని చెప్పడం పొరపాటు అవుతుంది. ఎందుకంటే, ఎవరైతే దుర్లాభము కొరకు కుటుంబాలను పాడు చేస్తున్నారో వారినుద్దేశించి పౌలు ఈ మాటలు చెప్పాడు . 

తీతు 1:13-14 - “ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనాకథలను, సత్యమునుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు  నిమిత్తము వారిని కఠినముగా గద్ధింపుము.” 

''ఈ సాక్ష్యము నిజమే.'' ఏ సాక్ష్యము?  క్రేతీయులందరు అబద్ధికులు, దుష్టమృగములు, మరియు తిండిపోతులు అని 12 వ వచనంలో చెప్పబడిన మాట నిజమే.''

''ఈ హేతువు చేత '' వారు అబద్ధికులు మరియు కుటుంబాలను పాడు చేచున్న కారణము చేత.

"కఠినముగా గద్ధింపుము'' - గద్దించమని తీతుకు పౌలు ఆజ్ఞాపించాడు.'' ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినపుడు, అతడు చేసిన తప్పుకు సరైన ఆధారము వున్నపుడు - గద్దించు, హెచ్చరించు, బుద్ది చెప్పు అని అర్ధం.

తీతు వారిని గద్దించడం మాత్రమే కాదు కాని కఠినముగా గద్దించాలి. మరొక మాటలో చెప్పాలి అంటే, పక్షపాతము లేకుండా గద్దించాలి (Gordon Fee, 179).

ఎందుకు వారిని కఠినముగా గద్దించాలి?

  1. ''విశ్వాసవిషయములో స్వస్థులగు నిమిత్తము'' - ఇక్కడ చెప్పబడుతున్న వారు ఎవరు? వారు క్రేతీయులా లేక క్రేతులో వున్నా విశ్వాసులా? క్రేతులో వున్నా విశ్వాసులనుగూర్చి ఎవరైతే అబద్దబోధల ఉచ్చులో పడుతున్నారో వారిని గూర్చి పౌలు మాట్లాడుతున్నాడని అర్ధం చేసుకోవాలి. (''సత్యమునుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను, యూదుల కల్పనాకథలను లక్ష్యపెట్టకుండు నిమిత్తము'').
  2. ''యూదుల కల్పనా కధలను, సత్యమునుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టకుండు నిమిత్తము,'' అదేమనగా, సువార్తను తిరస్కరించే మనుష్యుల కట్టడలను మరియు కల్పనా కధలను విశ్వాసులు లక్ష్యపెట్టకూడదు.  

తీతు 1:15 - “పవిత్రులకు అన్నియు పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనసాక్షియు అపవిత్రపరచబడియున్నవి.”

''పవిత్రులకు అన్నియు పవిత్రములే'' - ఎవరు పవిత్రులు? (1వ తిమోతి 4:4 చూడుము). ఎవరైతే అపవిత్రపరచబడకుండా వుంటారో మరియు అవిశ్వాసము లేకుండా వుంటారో వారు - ఇది వారి యొక్క మనసాక్షి, మరియు ప్రవర్తనకు సంబంధించినదిగా ఉంటుంది. అబద్ద బోధకుల యొక్క జీవితాలు పవిత్రుల యొక్క జీవితాలకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి, పవిత్రులకు అన్నియు పవిత్రములే. ఇది ఆహారమును గూర్చిన తినకూడని నిబంధనలు గుర్చినది. (1వ తిమోతి లో చెప్పిన విధముగా అబద్ద బోధకులు యొక్క బోధ వలె వుంది. వారు కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచున్నారు). 

''అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనసాక్షియు అపవిత్రపరచబడి యున్నవి.'' నైతికంగా ఎవరైతే చెడిపోయియున్నారో మరియు అవిశ్వాసులుగా వున్నారో, వారికి ఏది పవిత్రము కాదు . ఏది పవిత్రము కాదు ఎందుకంటే వారు విశ్వసించరు కాబట్టి. 

అపవిత్రపరచ బడినవారి మరియు అవిశ్వాసుల యొక్క మనస్సు, మనసాక్షి అపవిత్రపరచబడియున్నవని పౌలు వారిని గూర్చి వివరణ ఇస్తున్నాడు. 

తీతు 1:16 - “దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని, అసహ్యులును, అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై యుండి తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు.”

16వ వచనంలో సమస్య లేక పౌలు యొక్క నివేదిక చాల త్రీవ్రమైనది.

వారు కేవలం చెడిపోయినవారు మరియు అవిశ్వాసులు మాత్రమే కాదు వాస్తవానికి వారు దేవుని యెరుగుదుము అని చెప్పుకుంటారు కాని వారు అవిధేయులై యుండగా వారికీ దేవుడు తెలుసు అని ఎలా చెప్పుకుంటారు? ఇంకొక రీతిలో చెప్పాలంటే వారి యొక్క అవిధేయ ప్రవర్తన ఇలా చెప్పుకునేలా చేస్తుంది. 

కాని ఇక్కడ అంశం ఏంటంటే, వారికి తెలుసు; దేవుడు తెలుసు అని బహిరంగముగా ఒప్పుకుంటారు. (BDAG, 708). కాని సమస్య ఏంటంటే వారి క్రియలలో అది చూపించరు.

ఇది చెప్పడానికి, దేవుడు తెలుసు అని వారు చెప్పినప్పటికి నిజానికి వారికి దేవుని గూర్చి తెలియదు. కాని వారి యొక్క జీవన విధానము దేవుని గూర్చి వారికి జ్ఞానము తక్కువగా వున్నదని తెలియచేస్తుంది. 

''వారు అసహ్యులు'' - అసహ్యించుకునే లేదా అసహ్యంగా పరిగణించబడే వ్యక్తి లేక ఆ వ్యక్తికి సంభందించినది. ''అసహ్యించుకున్నా, అసహ్యకరమైన.''

''అవిధేయులు''- వారు దేవునికి అవిధేయులు. 

అవిధేయత అనేది ఈ విధంగా నిర్వచించవచ్చు: వారు దేవునికి అవిధేయులు. భ్రష్టులు అనేది బహుశా ఇంకా విరుద్ధ స్వభావముగా గుర్తించవచ్చు. ఎవరైతే భ్రష్టత్వం కలిగి వున్నారో వారు ప్రతి చోట తమకు తామే భ్రష్టులుగా వున్నారు. ముగింపులో వారి యొక్క పూర్తి నిష్ప్రయోజనమైన జీవితం కనపడుతుంది (తీతు 3:1; 2 వ తిమోతి 3:17).

''ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులు'' - వారు ఏ మంచి కార్యానికి పనికి రారు లేక అర్హులు కారు.

''సత్కార్యము'' దీని అర్ధం క్రియల ద్వారా రక్షణ అని కాదు. ఇది ఆంతరంగిక ప్రవర్తన యొక్క ప్రతిబింబం.

కావున, ముగింపులో క్రేతులో వున్నా అబద్ధికులను పౌలు కఠినముగా గద్దిస్తున్నాడు. వారు ఏమి చేస్తున్నారో బహిర్గతము చేస్తున్నాడు మరియు వారు దేవునికి అసహ్యులుగా వున్నారు. (పాత నిబంధన యొక్క భాష). తరువాతి అధ్యాయాలలో, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో చెప్తాడు.

Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.

Dr. Joel Madasu

About the author

{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}
>